దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌లతో విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రచ్చ కామన్ గా కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు, గవర్నర్ల మధ్య రచ్చ జరుగుతుంది. ఇక దీనికి తెలంగాణ ఏమి అతీతం కాదు. ఇక్కడ కూడా అదే స్థాయి రచ్చ ఉంది. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని, రాజకీయ నాయకురాలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ ప్రతినిధిగా ఉన్నారని అధికార బిఆర్‌ఎస్ విమర్శలు చేస్తుంది. అటు గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించడం లేదని తమిళిసై ఫైర్ అవుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు కేసిఆర్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లు పోరు నడుస్తోంది. తాజాగా కూడా ఖమ్మం బిఆర్‌ఎస్ సభలో కేసిఆర్..గవర్నర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదని, బీజేపీ నేతల మాదిరిగా ప్రవరిస్తున్నారని విమర్శలు చేశారు.
ఇక కేసిఆర్ వ్యాఖ్యలకు గవర్నర్ వెంటనే కౌంటర్లు ఇచ్చేశారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న తనకు రాష్ట్రంలో అందుతున్న ప్రొటోకాల్‌పై సీఎం కేసీఆర్ స్పందించిన తర్వాతే ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తానని, సీఎం కేసీఆర్ గవర్నర్‌ను అవమానించారని, రాష్ట్రంలో తనకు ఏడాదిగా ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిధిలో గవర్నమెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే అని, కానీ ప్రోటోకాల్ వ్యవహారం తేల్చాలి అంటూ ఆమె వివరణ ఇచ్చారు.
త్వరలోనే గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాలు రానున్నాయని, అప్పుడు తన పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రోటోకాల్ వ్యవహారంపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. మరి ఈ రచ్చ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.