మునుగోడు ఉపఎన్నిక వల్ల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పెద్దగా హైలైట్ కాలేదు. అయితే మీడియా మునుగోడుపై ఫోకస్ చేసి..రాహుల్ యాత్రకు పెద్ద కవరేజ్ ఇవ్వలేదు గాని..రాహుల్ యాత్ర తెలంగాణలో విజయవంతంగానే సాగింది..ఆయన యాత్ర జరిగిన ప్రాంతాల్లో జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది..కాకపోతే మీడియా కవరేజ్ లేకపోవడం వల్ల రాష్ట్ర స్థాయిలో హైలైట్ కాలేదు.
అయితే యాత్రలో రాహుల్ ఆద్యంతం ప్రజలని దగ్గర చేసుకుంటూ ముందుకెళ్లారు. అందరినీ హక్కున చేర్చుకున్నారు..అలాగే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా నడిచారు..డ్యాన్స్ వేశారు..పిల్లలతో ఆడుకున్నారు..ఏ వర్గం వాళ్ళతో ఆ విధంగా కలిసిపోయారు. ఇలా రాహుల్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఇక తాజాగా పాదయాత్ర తెలంగాణలో ముగిసి..మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. ఇక తెలంగాణలో పాదయాత్ర ముగింపు సందర్భంగా జుక్కల్‌లో భారీ సభ జరిగింది. ఈ సభ కూడా భారీ స్థాయిలోనే జరిగింది..ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్..తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రైతురుణాలు మాఫీ చేస్తామని, గిరిజనులకు పోడు భూములు, పట్టాలు ఇస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మోసగాళ్లని, ప్రజల దృష్టిలో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా నటిస్తున్నాయని, అంతర్గతంగా మాత్రం రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందముందని అన్నారు.
తెలంగాణలో తన పాదయాత్రకు ప్రజల నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి మంచి మద్దతు లభించిందని, ఇక్కడిప్రజలతో మమేకమయ్యాక.. వారిని వీడి వెళ్తుండడం భాధ కలిగిస్తోందన్నారు. ఇక యథావిధిగా రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో టిఆర్‌ఎస్, బిజేపిలపై విరుచుకుపడ్డారు. ఏదేమైనా గాని రాహుల్ యాత్రకు తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ మునుగోడు ఉపఎన్నిక, టిఆర్‌ఎస్, బిజేపిల మధ్య పోరు వల్ల అది హైలైట్ కాలేదు. అయితే అసలే మునుగోడులో భారీ ఓటమి పొందిన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ యాత్ర కాస్త ఉపశమనం అని చెప్పొచ్చు. అలాగే ఆయన ఇచ్చిన హామీలు కాస్త పార్టీకి ఊపు తెస్తాయి. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఏ మేర పుంజుకుంటుందో చూడాలి.