ఎడిట్ నోట్: అనర్హత..ఐక్యత.!

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఏమి క్రిమినల్ చర్యలు చేయలేదు..క్రిమినల్ గా కోర్టు శిక్ష పడలేదు. గతంలో మోదీ ఇంటి పేరు ఉన్నవాళ్ళంతా దొంగలు అన్నట్లు కామెంట్ చేశారు. అంటే వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న కొందరిని ఉద్దేశించి రాహుల్ ఆ కామెంట్ చేశారు. అయితే దీనిపై గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా కేసు వేశారు.

ఈ క్రమంలో దాన్ని విచారించిన సూరత్ కోర్టు…రెండేళ్ల పాటు రాహుల్ కు జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే బెయిల్ మంజూరు చేసి..నెల రోజుల్లోపు పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లవచ్చని తెలిపింది. అయితే రాహుల్ పై కోర్టుకు వెళ్ళేలోపు..ఆయనపై అనర్హత వేటు పడిపోయింది. మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది.

ఇలా అనూహ్యంగా రాహుల్ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేశారు. లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడిన గౌతమ్ అదాని గురించి ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం రాహుల్ పై ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ తో సహ విపక్షాలు ధ్వజమెత్తాయి.

అయితే రాహుల్ పై వేటుతో దేశంలోని విపక్షాలు అంతా ఏకమయ్యి..మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. బీఆర్ఎస్ సహా, ఆప్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్) ఇలా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తప్ప పడుతున్నాయి.

మహారాష్ట్రలో శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌‌ఠాక్రే, ఢిల్లీలో కేజ్రీవాల్‌, తమిళనాడులో స్టాలిన్‌, బెంగాల్‌లో మమత నుంచి తెలంగాణలో కేసీఆర్‌ వరకూ విపక్షనేతలు రాహుల్ పై వేటుని తప్పుబడుతూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశంపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి రాహుల్ విషయంలో కేంద్రం తొందర పాటు చర్యలకు పాల్పడిందనే విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news