రోజుకో గుడ్డు తినమని చెప్పే పొషకాహార నిపుణులు దానివల్ల శరీరానికికలిగే ప్రయోజనాలనే ఎక్కువగా చెబుతుంటారు. కానీ మీకిది తెలుసా? గుడ్డుతో తయారు చేసిన హెయిర్ మాస్క్, మృదువైన, మెరిసే కేశాలకు కారణం అవుతుంది. గుడ్డులోని పోషకాలు జుట్టులో ఇంకి, అందమైన మెరిసే కేశాలను మీకందిస్తాయి. గుడ్డులో ఉన్న విటమిన్లు, పోషకాలు కేశ సంరక్షణలో చాలా సాయపడతాయి. అందుకే ప్రస్తుతం గుడ్డుతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుని దానివల్ల కలిగే ప్రయోజనాలని తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన కేశాల కోసం గుడ్డుని ఎందుకు వాడాలి?
గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఏ, బి, డి, ఈ, కె మొదలగునవి.
విటమిన్-ఏ జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
విటమిన్-కె, తెల్లజుట్టు రాకుండా నిరోధించి, జుట్టు రాలడాన్ని ఆపుతుంది.
విటమిన్-బి వల్ల పొడిబారిన జుట్టు మృదువుగా తయారవుతుంది. ఇంకా జుట్టు పలుచగా మారడాన్ని నిరోధిస్తుంది. కేశాలకు కుదుళ్ళ నుండి బలాన్ని అందిస్తుంది.
విటమిన్-ఈ కారణంగా కేశాలు మృదువుగా తయారవుతాయి. అలాగే మంచి పోషణ దొరుకుతుంది.
అలాగే గుడ్డులో ఉన్న సెలేనియం, జింక్, సల్ఫర్, కాపర్ మొదలగునవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
ఎగ్ హెయిర్ మాస్క్ తయారీ కావాల్సిన పదార్థాలు
1 గుడ్డు
1 అరటి పండు
3టేబుల్ స్పూన్ తేనె
3టేబుల్ స్పూన్ల పాలు
5టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
తయారీ విధానం
పై పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలి. బాగా చికనైన మిశ్రమం అయ్యాక నెత్తిమీద మర్దన చేయాలి. గంట తర్వాత షాంపూతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మృదువైన, మెరిసే కేశాలు మీ సొంతం అవుతాయి.