టీడీపీలో చిచ్చురేపుతున్న ఎన్నికల బహిష్కరణ నిర్ణయం

-

జిల్లా పరిషత్‌,ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న నిర్ణయం టీడీపీలో ప్రకంపనలు రేపుతుంది. పార్టీలో సీనియర్ నేతలు సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పొలిట్‌బ్యూరోతో చర్చించి టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై పార్టీ నేతల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేడర్‌ మాట వినకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నలతో పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు పలువురు సీనియర్ నేతలు.

ఎన్నికలు బహిష్కరిస్తు పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ జ్యోతుల నెహ్రూ ఏకంగా టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కేవలం జగ్గంపేట ఇంఛార్జ్‌గా మాత్రమే కొనసాగుతానన్నారు. మరో సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు సైతం పార్టీ నిర్ణయాన్ని విభేదించారు. బరిలో ఉన్న అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్‌ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ నిర్ణయంతో నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని చెప్పారు.

మరోవైపు అశోక్‌ గజపతి రాజు కూతురు అతిది గజపతి రాజు మాత్రం పార్టీ నిర్ణయానికి భిన్నంగా వెళ్తున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలంటూ టీడీపీ తీసుకున్న నిర్ణయంపై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయ్‌. నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఓ వైపు టీడీపీ పనైపోయిందని వైసీపీ విమర్శిస్తున్న సమయంలో తాజా తుఫాన్‌ టీడీపీలో కల్లోలం రేపుతోంది. ఇది ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news