అమరావతి : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనున్న జగన్ సర్కార్… ఉద్యోగులకు అవసరమైతే సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.
వాయిదా పద్ధతిన చెల్లింపులకు ఆస్కారం కల్పించింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్ సంస్థలు రాయితీ ఇస్తాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి అందించవద్దని పేర్కొంది.
వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి నెల వారీగా వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించింది. నెలకు రూ. 2500 వరకూ వాయిదా చెల్లించేలా వెసులుబాటు కల్పించింది జగన్ సర్కార్.