హైదరాబాద్ : ఒకే రోజు వైద్య ఆరోగ్య శాఖలో 16 వందల మంది సిబ్బందిని తొలగించింది తెలంగాణ సర్కార్. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, టిమ్స్ తదితర ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై కోఠిలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు నిరసనలు తెలిపారు బాధితులు. కాంట్రాక్టును రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారన్న కాంట్రాక్టు ఉద్యోగులు… ఇప్పుడు అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ధర్నా చేస్తున్న హెల్త్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. అయితే… దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడం దారుణమని… కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యలవల్ల గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 1600 మంది నర్సులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం కోసం రోడ్డెక్కిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. కరోనా కాలంలో ప్రాణాలకు ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు రోగులకు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించిన నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే నజరానా ఇదేనా? అని మండిపడ్డారు.