వరి పంట వేయడం పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు హుజూరాబాద్ ఎమ్యెల్యే ఈటల రాజేందర్. నీరు వచ్చిన తర్వాత మెట్ట పంట వేయలేమని.. తెలంగాణ రైతులు వరి పంట వేయడమే కరెక్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలనే సోయి కేసీఆర్ కు లేదని.. ముఖ్యమంత్రికి సీట్ల మీద ఉన్న యావ ప్రజా సమస్యల మీద లేదని మండిపడ్డారు. ధర్మాన్ని నిలబెట్టడం లో మీడియా చాలా గొప్పగా పని చేసిందని.. హుజురాబాద్ లాంటి ఎన్నిక భవిష్యత్ లో కూడా చూడలేమన్నారు.
ప్రతి వ్యక్తిని ప్రలోభాల ద్వారా ప్రభావితం చేసే విదంగా టీఆరెస్ పార్టీ ప్రచారం చేసిందని.. కేసీఆర్ అహంకారాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే చెంప చెళ్లుమనేలా ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. చర్మం వొలిచి చెప్పులు కుట్టించిన కూడా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చలేనిదన్నారు. వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని పోలీస్ ఎస్కార్ట్ వెహికిల్ లో తీసుకొచ్చారని.. స్వయంగా పోలీసుల పర్యవేక్షణ లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని వెల్లడించారు.
గ్రామ స్థాయిలో వుండే చిన్న ఉద్యోగులను కూడా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారని.. బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న వాళ్ళ కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. డబ్బు ద్వారానే రాజకీయాలు చేయవచ్చని రాజకీయాలను నీచ స్థాయికి దిగదార్చిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. నాతో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను కక్షకట్టి ట్రాన్స్ఫర్ చేశారని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్.