మంచిర్యాలలో బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీని రద్దు చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మూడో స్థానమే వస్తుందని జోస్యం చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య ఇదివరకు 63 వేలు ఉండగా ఇప్పుడు 39వేలకు పడిపోయిందన్నారు. ఇక్కడ సింగరేణిలో నిరుద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను పోగొట్టిన దుర్మార్గుడు కసీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు.
తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రయివేటుపరం చేశాడని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా నెరవేర్చుకోలేదన్నారు. సింగరేణి ఇప్పుడు చచ్చుపడిపోయిందన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాశారని, అందుకే నేటికీ సింగరేణిలో ఎన్నికలు జరిపించలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ ఛాయ్ అమ్మాడని, ఆయన తల్లి ఇళ్లలో పని చేసేదని, అలాంటి స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగారన్నారు. మోదీ కష్టాన్ని, ధైర్యాన్ని నమ్ముకోవడం వల్లే ఆ స్థాయికి చేరుకున్నారన్నారు ఈటల రాజేందర్.