ఇది కౌరవులు, పాండవుల మధ్య యుద్దం : కెసిఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

మాజీ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి తెలంగాణ సిఎం కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎమ్మేల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇవాళ ఆయన తన సొంత నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ డబ్బులు, దౌర్జన్యంతో గెలవలేడని, ఇది కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధం అని  పేర్కొన్నారు. 19 సంవత్సరాలు గులాబీ జెండాను మోసానని.. కష్టకాలంలో అండగా ఉన్న నన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను ఎవరూ కొనలేరు అని ఈటల పేర్కొన్నారు. కొందరు నాయకులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని.. వారిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో ఆత్మగౌరవానికి ఛాన్స్ లేదని ఆయన పేర్కొన్నారు. అంతిమ విజయం ఎప్పుడు ప్రజలదేనని స్పష్టం చేశారు. కాగా ఇటీవలే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.