ఫోన్ ట్యాపింగ్ కేసు లో బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానని పేర్కొన్నారు. మళ్లీ విచారణకు ఎప్పుడూ పిలిచినా వస్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విచారణకు ముందు కూడా చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు.
జిల్లాలో పని చేసిన పోలీస్ అధికారులతో తాను మాట్లాడి ఉండవచ్చనని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారుల పోస్టింగ్ ల కోసం, కార్యకర్తల అవసరాల కోసం మాట్లాడటం సహజమేనని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనకు నోటీసులు వచ్చాయని వెల్లడించారు చిరుమర్తి లింగయ్య. తనకు అందిన నోటీసులపై న్యాయ పోరాటం కూడా చేస్తానని తెలిపారు.