శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. రణీల్ విక్రమ సింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం తెలిసిందే. దీంతో నిరసనకారులు టెంట్లు ఏర్పాటు చేసుకుని ఆందోళన చేపడుతున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల టెంట్లు తొలగించేందుకు రంగంలోకి దిగారు.
ఈ మేరకు విక్రమ సింఘే ప్రభుత్వం అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. దీనిపై పార్లమెంట్‌లో ఓటింగ్ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. మరో నెల రోజులపాటు శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని అమలు చేసింది. కాగా, మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్ పారిపోయారు. జులై 14న మాల్దీవుల నుంచి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు 14 రోజుల పర్యటన పాస్ ఇచ్చింది. ఆగస్టు 11వ తేదీన గొటబయ సింగపూర్ చేరుకోనున్నారు.