జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించినట్లుగా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మేరకు ఆంధ్ర- తెలంగాణతో పాటు, అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కు ఏ విధంగా ఈ స్థాయి భద్రతను కల్పించారని ? కేవలం బీజేపీ తో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ విధంగా భద్రత కల్పించి ప్రజాధనాన్ని వృధా చేస్తారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో జనసేన పార్టీతో బీజేపీకి అవసరం ఉండటం, తెలంగాణ -ఆంధ్రా లో ఆయన సేవలను వినియోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు బిజెపి ఈ విధంగా ఆయనకు ప్రాధాన్యం పెంచిందని, ఇలా ఎన్నో రకాలుగా విమర్శలు బిజెపి ఎదుర్కొంది.
సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరిగింది. పవన్ ఫ్యాన్స్ బిజెపికి థాంక్స్ చెప్తూ హడావుడి చేయగా, మరికొందరు మాత్రం పవన్, బీజేపీలను విమర్శించారు. ఇది ఇలా ఉండగా.. అసలు పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించడం లేదని, అవన్నీ కేవలం వట్టి పుకార్లేనని జనసేన కార్యాలయం క్లారిటీ ఇవ్వడంతో, ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చింది. ” పవన్ కళ్యాణ్ కు జడ్ కేటగిరీ భద్రత కల్పించారనే ప్రచారంలో నిజం లేదు అని, జెడ్ కేటగిరి భద్రత కల్పించే విషయంలో ఎవరూ తమను సంప్రదించలేదు అని, మేము కూడా పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని రిక్వెస్ట్ చేయలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అంటూ జనసేన కార్యాలయం క్లారిటీ ఇచ్చేసింది.
అయితే అప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేందుకు ఆయనకు అర్హతలు ఉన్నాయా అనే అంశాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. మన దేశంలో వీఐపీలకు రక్షణ కల్పించే నిమిత్తం ఐదు రకాల భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. జడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ ఇలా కేటగిరీలుగా విభజించి వారి ప్రాణహాని స్థాయిని బట్టి భద్రత కల్పిస్తారు. ఎవరైనా తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా కోరితే వారికి భద్రత కల్పించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పవన్ కు జెడ్ కేటగిరి భద్రత విషయమై ఇదంతా తప్పుడు ప్రచారం అయినా, రానున్న రోజుల్లో ఆయనకు భద్రత కల్పించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పవన్ అవసరం ఇప్పుడు జనసేన కు ఉందొ లేదో తెలియదు కానీ, బిజెపి కి మాత్రం చాలా అత్యవసరమే.
-Surya