నేటి సమాజంలో యువత ఈజీ మనీ కి అలవాటుపడి.. చెడు దారులు తొక్కుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా సత్తుపల్లి టు సత్తెనపల్లి ఫేక్ కరెన్సీ సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ముఠా గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొందరు వ్యక్తులకు అసలు నోట్లకు, రెట్టింపు దొంగనోట్లు ఇస్తామంటూ ఆశ చూపారు. నోట్లు మార్చుకునేందుకు విస్సన్నపేట మండలం పుట్రేల రావాలని సూచించారు. సత్తెనపల్లికి చెందినవారు పెద్ద మొత్తం నగదుతో ఒక కారులో పుట్రేల చేరుకోగా, సత్తుపల్లికి చెందినవారు మరో కారులో అక్కడకు చేరుకున్నారు.
నోట్ల కట్టల్లో రెండు వైపులా అసలు నోట్లు పెట్టి, మధ్యలో తెల్ల పేపర్లతో తయారు చేసిన నోట్ల కట్టలతో సత్తెనపల్లికి చెందినవారిని మోసగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, విస్సన్నపేట పోలీసులు అక్కడికి వచ్చి, ఇరువర్గాలను, వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే, సత్తుపల్లికి చెందిన కొందరు నిందితులు పరారవడంతో, పోలీసులకు అనుమానం వచ్చి, కార్లు చెక్ చేశారు. దీంతో కళ్లు బైర్లు కమ్మేలా ఉన్న రెండు వేల నోట్లు బయటపడ్డాయి. దాదాపు 47.5 లక్షల నకిలీ నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే, ఈ కేసులో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.