రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. మంచి కంటే.. చెడునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెక్నాలజీని మంచిపనుల కంటే.. చెడు పనులకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లు ముద్రిస్తూ మార్కెట్‌లో చలామణి చేస్తున్న ముఠా సభ్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలైన మహిళ పరారీలో ఉంది. మంగళవారం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనా దీప్తి, గోపాలపురం ఏసీపీ సుధీర్, సీఐ సాయిఈశ్వర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఫుట్‌పాత్‌పై పండ్ల వ్యాపారం చేస్తున్న రామస్వామి బిజీగా ఉన్న సమయంలో నాచారానికి చెందిన అంజయ్య వంద రూపాయల నోటు ఇచ్చి పండ్లు కొనుగోలు చేశాడు. పండ్ల వ్యాపారి అది నకిలీ నోటుగా గుర్తించి గోపాలపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన గోపాలపురం క్రైమ్ డీఐ కోటయ్యతోపాటు ఎస్‌ఐ పాండురాజు, క్రైమ్ కానిస్టేబుళ్లు పండ్ల వ్యాపారి వద్దకు వచ్చి వంద రూపాయల నోటు ఇచ్చిన అంజయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు.
బండ్లగూడకు చెందిన కస్తూరి రమేశ్ బాబు(35) మెకానిక్‌గా పనిచేస్తూ.. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు బండ్లగూడలోని రమేశ్ బాబు ఇంట్లో సోదాలు చేశారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని నకిలీ నోట్లు స్వాధీనం చేసుకొని, రమేశ్ బాబును అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌బాబు నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటే రామేశ్వరి పాత్ర వెలుగులోకి వచ్చింది. ఆమెకు టెక్నాలజీపై ఐడియా ఉంది. యూట్యూట్ ద్వారా నకిలీ నోట్లను ఇంట్లో ఎలా తయారు చేస్తారన్న విషయంపై అవగాహన పెంచుకున్నారు. చిన్నగా నకిలీ నోట్లను తయారు చేసి చిన్న దుకాణాల్లో చలామణి చేస్తున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. దీంతో రమేశ్ బాబు, రామేశ్వరి, అంజయ్యపై కేసులు నమోదు చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకోగా.. రామేశ్వరి పరారీలో ఉంది. తొలుత నిందితులిద్దర్ని కోర్టులో హాజరు పరిచి, ఆ తర్వాత విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. పాఠాలు నేర్పిన యూట్యూబ్‌పై కూడా ఆరా తీస్తున్నారు. నిందితుల నుంచి రూ.3.16 లక్షల నకిలీ నోట్లు, ప్రింటర్, ల్యాప్‌టాప్, స్క్రీన్ ప్రింటర్, టాటా ఇండికా వాహనం, పేపర్ కటింగ్ యంత్రం, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకున్న గోపాలపురం పోలీసులకు నగదు రివార్డును డీసీపీ ప్రకటించారు.