పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య… కలకలం రేపుతున్న సూసైడ్ లేఖ

రాజమండ్రి: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మామిడికుదురు మండలం మొగలికుదురులో పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం పిల్లలతో కలిసి బైక్‌పై చంచినాడ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన భార్యభర్తలు నదిలో దూకి బలవన్మరాణానికి పాల్పడ్డారు. నలుగురు ఒకేసారి నదిలోకి దూకారు. స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. నదీలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నలుగురు కూడా నీటిలో కొట్టుకుపోయారు. నదిలో ఇద్దరు పిల్లల దుస్తులు లభ్యంకావడంతో నలుగురూ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

కాగా మృతదేహాలను బయటకు తీసేందుకు గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సూసైడ్ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ కుటుంబాన్ని ఓ వ్యక్తి ఆర్థికంగా మోసం చేసినట్లు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమస్యల వల్లే కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియలేదు. బ్రిడ్జిపై ఉంచిన బైక్ నెంబర్ ఆధారంగా వారిని గుర్తిస్తున్నారు.