సోషల్ మీడియా పిచ్చి ఈరోజుల్లో యువతకు ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫేమస్ అవ్వాలని తాపత్రయ పడేవాళ్లు కొందరైతే.. టైమ్ పాస్‌కు చూసేవాళ్లు మరికొందరు. అప్పట్లో టిక్‌టాక్ ఉన్నప్పుడు ఎంతోమంది వారి టాలెంట్‌తో పైకి వచ్చారు. ఇంకా వింత వింత మనుషులను కూడా మనం చూశాం.. ఒకదశలో టిక్‌టాక్ బ్యాన్ అయిపోతే బాగుండు అని అనుకున్నాం.. అలానే అయింది. అది పోతేనేం..ఇన్‌స్టాగ్రామ్ ఉందిగా.. అక్కడ ఉన్నవాళ్లంతా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇన్‌స్టా రీల్స్‌లో మంచి ఫిల్టర్స్ వేసి వెరైటీ కంటెంట్‌తో మనల్ని ఆకట్టుకుంటున్నారు.. ఇక్కడి వరకూ బానే ఉంది.. వాళ్లు ఏదో వ్యూస్, లైక్స్ కోసం ఎమోషనల్ డైలాగ్స్‌తో రీల్స్ చేస్తారు. అవి అన్నీ నిజమే అని మనం నమ్ముతూ.. కామెంట్‌లో బాధపడకండి బ్లా బ్లా అంటూ కమెంట్స్ చేసే బ్యాచ్ కూడా ఉంటుంది చూసే ఉంటారుగా..అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇలాంటి ఓ అమాయకపు అబ్బాయిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ఏకంగా 31లక్షలకు టోపీ పెట్టింది.. ఏం జరిగిందంటే..
ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది కదా అని ఆనందపడే లోపే ఆ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా లక్షల్లో కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా 31 లక్షల 66 వేల రూపాయలు లూటీ చేసిన ఒక కిలాడీ టిక్ టాకర్ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు దఫాలుగా ఎనిమిది నెలల కాలంలో రూ. 31లక్షల 66 వేల రూపాయలు కొల్లగొట్టిన ఒక కిలాడీ లేడీ గురించి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక యువకుడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిగితే సదరు కిలాడీ లేడీ బయటకొచ్చింది. మచిలీపట్నానికి చెందిన పరసా తనుశ్రీ సోషల్ మీడియాలో టిక్ టాక్ లు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది.
టిక్ టాక్ బాన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పలు పాటలకు, లిప్ సింక్ వీడియోలకు పర్ఫామెన్స్ చేస్తూ.. ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వచ్చింది. 1) sritinsu 2) sri.tinsu 3) sri_tinsu 4) lucky_sritinsu అనే నాలుగు అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రెచ్చిపోయింది. ఆమె అందానికి ఫిదాఅయి కామెంట్ పెడితే వెంటనే వాళ్ళకి ఇన్బాక్స్లో వారికి మెసేజ్ చేస్తూ.. మాటలు కలుపుతూ పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది.
అలా మాట కలిపి ఒక వ్యక్తితో ఏకంగా 31 లక్షల 66 వేల రూపాయలు అకౌంట్‌లో వేయించుకుంది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, తన ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం హాస్పిటల్‌కి కడుతున్నానని చెబుతూ 31 లక్షల 66 వేల రూపాయలను కాజేసింది. అయితే నిజానికి ఆమె మరో వ్యక్తితో లివింగ్ రిలేషన్‌లో ఉంటూ లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడింది. ఆ ఖర్చులను ఇలా పలువురు దగ్గర నుంచి తన పార్ట్నర్ రాబట్టినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను, ఆమెకు సహకరించిన ఆమె పార్ట్నర్‌ను అరెస్ట్ చేసి రెండు సెల్ ఫోన్లు పలు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
కేవలం ఒక్కరి దగ్గర నుంచే కాదని తనను పెళ్లి చేసుకుంటానని కామెంట్ పెట్టిన చాలామంది దగ్గర నుంచి తను డబ్బులు కాజేశానని తనుశ్రీ ఒప్పుకుంది. ఆమెకు నాలుగు అకౌంట్లు ఉండగా అందులో ఒక అకౌంటుకు 60 వేల మంది ఫాలోవర్లు కూడా ఉండడం గమనార్హం.
సో అబ్బాయిలు మోరల్ ఆఫ్ దీ స్టోరీ ఏంటంటే.. సోషల్ మీడియాలో పెళ్లి చేసుకుంటాను అంటూ ఎవరైనా కామెంట్ చేస్తే పొంగిపోయి రిప్లై ఇవ్వకండి. ఇలాంటి కిలాడీ లేడీలు చాలామంది ఉంటారు.. అయినా పాపం ఆ అమ్మాయిని నమ్మి అంత డబ్బు ఇచ్చాడంటే ఆ బాధిత యువకుడు ఎంత సిన్సియర్‌గా ఆమెను లవ్ చేశాడో కదా.!