ప్రశ్నించడానికంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్… రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అధికారపక్షాన్ని వదిలి, ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడ మొదలయ్యింది పవన్ రాజకీయ అవగాహనారాహిత్యపు అడుగుల ప్రయాణం! అనంతరం పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ మోడీని తిట్టడం.. అనంతరం కమలం చాటునే కాలం గడుపుతుండటం.. వరుసపెట్టి బీజేపీ విషయంలో పవన్ చేస్తున్న తప్పులు ఇవి! దీంతో… ఇప్పుడు పవన్ కు సూచనలు చేస్తూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు!
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగిన జనసైనికుల్ని బలవంతంగా వెనక్కు రప్పించడం దగ్గరనుంచి.. ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో మొండి చేయి చూపించడం వరకూ… జనసేనకు బీజేపీ వెనుకదెబ్బలు కొడుతూనే ఉంది! కంట్రోల్ లో పెట్టుకుంటూనే ఉంది! జనసేన స్థాయిని గుర్తుచేస్తూనే ఉంది! అయితే… తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం… ఆ రోజులు మారాయి అంటున్నారు జనసైనికులు!
చంద్రబాబు వదిలేస్తే మోడి వైపు.. మోడీ ఛీ పో అంటే చంద్రబాబువైపు చూసే రోజులు పోయాయి. సైకిల్ పరుగెత్తడం కోసం తాము గాలికొట్టించుకోవడం.. కమలం వికసించడం కోసం తాము బురదలో కూరుకుపోవడం ఇక కుదరదని జనసైనికులు గట్టిగా చెబుతున్నారు! అవును… 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జనసైనికులను మానసికంగా చంపేసినా… తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆశలు చిగురించేలా చేశాయి.
తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో… గోదావరి జిల్లాల్లో జనసేన జెండా కాస్త రెపరెపలాడింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వైసీపీకి చెందినవారే ఉన్న నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా తన ఉనికి చాటుకుంది. అధికారికంగా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఆ పార్టీ తన మనుగడను ఎక్కడికక్కడ ప్రశ్నార్థకం కాకుండా చూసుకుంది. మరికొన్ని చోట్ల టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగింది. దీన్ని జనసేనాని విజయం అనలేము కానీ… కచ్చితంగా జనసైనికుల ఐకమత్య విజయం అని మాత్రం చెప్పవచ్చు!
బీజేపీ – జనసేన, టీడీపీ – జనసేన… ఇలా జనసేన ఎవరితో పొత్తుపెట్టుకున్నా… ఆ పార్టీ నేతల దృష్టిలో జనసైనికులు ఎప్పుడూ చిన్నచూపుకే గురయ్యేవారు! కానీ ఇప్పుడు రోజులు మారాయి. బీజేపీ కంటే జనసేనకే ఏపీలో కాస్త ఎక్కువ బలం ఉందనే విషయం రుజువైంది. కొన్ని చోట్ల టీడీపీ కంటే కూడా జనసేనకే బలం ఎక్కువ అన్న విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో… ఇకనైనా పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తూ, వ్యక్తిగత లాభాల కోసం పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్న పొత్తులు పక్కనపెట్టాలని కోరుకుంటున్నారు జనసైనికులు! పూర్తిగా మనసుపెట్టి – పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తే… కచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించొచ్చని చెబుతున్నారు. మరి ఫ్యాన్స్ కం కార్యకర్తల మాట పవన్ వింటారా లేక.. తనకు తెలిసిందే జ్ఞానం – తాను చూసిందే లోకం అని భావిస్తూ.. ఓంటెద్దు పోకడలకు పోతూ పార్ట్ టైం రాజకీయాలే చేస్తారా అన్నది వేచి చూడాలి!