తిరుపతి లోక్‌సభ ఎన్నికల పై టీడీపీ కేడర్ లో కొత్త టెన్షన్

Join Our Community
follow manalokam on social media

తిరుపతి ఉప ఎన్నిక గెలుపు పై వైసీపీలో గట్టి ధీమా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. మరో వైపు ఉపఎన్నికపై చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఎన్నికల నిధుల సమీకరణ పై మాత్రం నోరు మెదపడం లేదు. ఇప్పుడిదే అంశం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను టెన్షన్ పెడుతుంది. ఇదే సమస్యతో ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కుదేలవ్వడంతో ఇప్పుడు ఉపఎన్నిక పై నేతల్లో టెన్షన్ మొదలైంది.

ఏపీలో జరిగిన వరస ఎన్నికలు టీడీపీకి నిరాశే కలిగించాయి. పంచాయతీల్లో క్యాడర్ కొంత పోరాడినా.. మున్సిపాలిటీలకు వచ్చే సరికి సీన్ రివర్స్‌ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అర్బన్ ప్రాంతాల్లోనూ ఓటమి తప్పలేదు. ఈ ఓటములకు ప్రధాన కారణాల్లో ఒకటి పార్టీకి నిధుల సమస్య. పార్టీ సీనియర్‌ నాయకులు, లోక్‌సభ పరిధిలోని టీడీపీ ప్రతినిధులతో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎవరెవరు ఏ బాధ్యత తీసుకోవాలో నాయకులతో చర్చించారు పార్టీ అధినేత. కానీ అసలు విషయం వచ్చే సరికి మాత్రం స్పష్టత కరువైందని ఊసురుమంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ముఖ్యనేతలతో మీటింగ్ అయిన తర్వాత ఏడు నియోజవకర్గాల నాయకులతోనూ విడిగా సమావేశమయ్యారు చంద్రబాబు. ఎన్నికల్లో నిధుల సమీకరణ గురించి ఎటువంటి సూచనలు, హామీలు లభించలేదట. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ పోరాటం చేయాలంటే ఆర్ధికంగా నిధులు భారీగానే కావాలని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా వైసీపీ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉండటంతో ఢీకొట్టాలంటే ఆ స్థాయిలోనే ఎన్నికల వ్యూహం ఉండాలన్నది టీడీపీ నేతలు చెప్పేమాట.

చిత్తూరు జిల్లాలో అన్ని ఎన్నికలు తానై నడిపించారు మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లోనూ ఆయనే లీడ్‌ తీసుకుంటున్నారు. వైసీపీ వ్యూహానికి తగ్గట్టుగా టీడీపీలో మీటింగ్‌లు, సమీక్షలు, కమిటీల ఏర్పాటు జరుగుతున్నా.. ఖర్చుల గురించి పార్టీ హైకమాండ్‌ సైలెన్స్‌ అవ్వడం మాత్రం స్థానిక నేతలను టెన్షన్ పెడుతుందట. ఇక అభ్యర్థి పనబాక లక్ష్మి తన ప్రచార ఖర్చులు చూసుకోవడమే కష్టంగా ఉందట..అటు అభ్యర్థి ఇవ్వక, ఇటు జిల్లాలో నిధుల సమీకరణ జరగక.. ఇంకోవైపు అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నాయకులు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...