నాయ‌కుడే లేడు యుద్ధ‌మేంటి..? సీఎం అభ్య‌ర్థిని తేల్చండి ఫ‌స్ట్‌..

-

కేంద్రంలో రెండోసారి సొంత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ….దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ సత్తా చాటాడానికి చూస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ అధినాయకుడు, సీఎం కేసీఆర్‌ని గద్దె దింపి, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కూడా చేసింది.

ఇక దుబ్బాక విజ‌యం, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 48 సీట్లు చేజిక్కించుకొని స‌త్తా చాటిన బీజేపీ పార్టీ, నాగార్జున సాగ‌ర్‌లో మాత్రం చ‌తిక‌ల ప‌డింది. స‌రే గెలుపు ఓటములు స‌హ‌జం. కాక‌పోతే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కోసం ప‌క్కా ప్ర‌ణాళిక అవ‌స‌రం. మ‌రి ఆ దిశగా అడుగులు వేస్తుండ‌వ‌చ్చు గాక‌, సీఎం కేసీఆర్ లాంటి రాజ‌కీయ నాయకుడిని ఎదుర్కోవాలంటే రాష్ట్రంలో బ‌ల‌మైన నాయ‌కుడిని ముందు ఉంచాలి. మ‌రి ఆయ‌నే సీఎం క్యాండెట్‌గా ప్ర‌క‌టించాలి క‌దా… వెస్ట్ బెంగాల్‌లో వ‌చ్చిన ఫ‌లితాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

బెంగాల్‌లో బలంగా ఉన్న మమతాని ఎదుర్కోవాలంటే, అంతే బలంగా ఉన్న నాయకుడు బీజేపీకి ఉండాలి. కానీ బీజేపీలో అలాంటి బలమైన నాయకుడుని సీఎం అభ్యర్ధిగా ప్రకటించలేదు. బెంగాల్‌లో ఎన్నికల ముందు సీఎం అభ్యర్ధిని ప్రకటించి ఉంటే ప్రజలకు కాస్త క్లారిటీ ఉండేది. సీఎంగా ఆ నాయకుడు సెట్ అవుతాడనే కోణంలో ప్రజలు ఓట్లు వేసేవారు. అది బీజేపీకి కాస్త ప్లస్ అయ్యేది. అయితే బీజేపీ అలాంటి ప్రయత్నం చేయలేదు. సీఎం అభ్యర్ధిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లారు. మమతా బెనర్జీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.

ఇక తెలంగాణలో సైతం సీఎం అభ్యర్ధిని నిర్ణయించుకోకుండానే, గత రెండేళ్ల నుంచి ఇతర పార్టీలకు చెందిన నాయకులని బీజేపీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్‌లకు చెందిన పలువురు నాయకులని పార్టీలో చేర్చుకున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం కాషాయ కండువా కప్పేశారు. ఆయనతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, బీజేపీలో చేరారు. అయితే ఇలా వరుసపెట్టి ఇతర పార్టీ నాయకులు బీజేపీలోకి వలస వస్తున్నారు.

ఇతర పార్టీ నాయకులు రావడం వల్ల బీజేపీకి లాభం ఎంత ఉంటుందో…నష్టం కూడా అంతే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే జంపింగ్ నాయకులతో పార్టీ ఫుల్ అవుతుంది. ఇక ఆ జంపింగ్ నాయకులు చాలా ఆశలతో పార్టీలోకి వస్తారు. ఒకవేళ గానీ వాళ్ళ ఆశలు నెరవేరకపోతే, అసంతృప్తితో పార్టీని పైకి తీసుకురావడానికి కష్టపడరు. దాని వల్ల బీజేపీకే డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఇప్ప‌టికిప్పుడు సీఎం క్యాండెట్‌ని ప్ర‌క‌టించినా జ‌ర‌గ‌వ‌చ్చు.. కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఆ అభ్య‌ర్థి, పార్టీ అప్ప‌టి వ‌ర‌కు సెటిల్ అవొచ్చు.

గ‌తంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, జాతీయ పార్టీల‌పైన ఇవే ర‌క‌మైన విమ‌ర్శ‌లు చేశారు. సీఎం అభ్య‌ర్థి లేకుండా.. అంటే నాయ‌కుడు లేకుండా యుద్ధ‌మేంటంటూ వెట‌కారాలు వినిపించాయి. ఇక ఢిల్లీకి గులాంలు అంటూ విమ‌ర్శ‌లు చేశారు. స్థానికంగా స‌రైన నాయ‌క‌త్వాన్ని ఏర్ప‌రిస్తే.. ప్ర‌తీ చిన్న విష‌యానికి ఢిల్లీ పై ఆధారప‌డే అవ‌స‌రం ఉండ‌దు. అది పార్టీకి మంచి చేసే అంశం. రాష్ట్రానికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను రాష్ట్ర‌నేత‌లే తీసుకొనే వీలు కల్పించాలి.

మ‌రి సీఎం క్యాండెట్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇప్ప‌టి వ‌ర‌కైతే దొర‌క‌లేదు, క్లారిటీ లేదు. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ని సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పార్టీలో కిషన్ రెడ్డితో పాటు చాలామంది సీనియర్లు ఉన్నారు. అయితే ఇలా సీఎం అభ్యర్ధి ఎవరో తెలియకుండా ఎక్కువకాలం సాగదీస్తే పార్టీకే ఇబ్బంది. ఇప్పటికే పార్టీలో చాలామంది సీఎం రేసులో ఉన్నామని మెంటల్‌గా ఫిక్స్ అయి ఉంటారు.. అది త‌ప్పుకూడా కాదు. తీరా ఎన్నికల సమయంలో ఢిల్లీ అధిష్టానం ఒకరిని ఫిక్స్ చేస్తే, మిగతా వారు అసంతృప్తిగా గురవుతారు. దాని వల్ల పార్టీకి న‌ష్టం, న‌ష్ట నివార‌ణ చెయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

పైగా పార్టీకి ఒకే నాయకత్వంపై లేకపోతే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ప్రతి నిర్ణయం ఢిల్లీ నుంచే రావాలి అంటే, స్థానికంగా ఉండే నాయకులకు కూడా ఇబ్బందే. అటు పార్టీకి సంబంధించి ఆర్ధికపరమైన అంశాల్లో సైతం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బీజేపీ త్వరగా ఒక సీఎం అభ్యర్ధిని ఫిక్స్ చేసుకుని ముందుకెళితే బెటర్ ఏమో! నిజానికి యుద్ధం ఇంకా మిగిలే ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news