కోట్లాది మంది ఆశలను జాబిల్లిపైకి మోసుకెళ్లిన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై కాలు మోపిన చంద్రయాన్-3 ‘నేను నా గమ్యాన్ని చేరుకున్నా’ అన్న సందేశాన్ని ఇస్రో కేంద్రానికి పంపింది. మరో నాలుగు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి రానుంది. అనంతరం 14 రోజులపాటు ల్యాండర్, రోవర్ జాబిల్లిపై కీలక పరిశోధనలు జరపనున్నాయి. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది.
సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి.. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు జరపనుంది. యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. ఇప్పటివరకు ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపింది. దీంతో ప్రపంచ యవనికపై భారత పతాకం రెపరెపలాడింది. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా భారతీయులు సంబురాలు చేసుకుంటున్నారు. ‘జయహో భారత్’ అని నినదిస్తున్నారు.