ఏపీలో జనసేన బలం నిదానంగా బలపడుతుంది..గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీ బలం చాలావరకు పెరిగింది. అధికార వైసీపీ బలం తగ్గుతుంటే.ఆ బలం పూర్తి స్థాయిలో టిడిపికి వెళ్లకుండా..జనసేనకు ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 6 శాతం ఓట్లు వస్తే..ఇప్పుడు 11 శాతం వరకు పెరిగాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకటే సీటు వస్తే..ఇప్పుడు 7 సీట్లు వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
అయితే ఈ బలం మరింత పెంచేలా పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులని తయారుచేయడం కష్టం..ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని లాగేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నాయకులు జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు. టీవీ రామారావు, కాండ్రు కమల, ఈదర హరిబాబులు జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారు.
రామారావు 2009లో టిడిపి నుంచి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు..2019 ఎన్నికల్లో టిడిపి సీటు రాలేదని చెప్పి వైసీపీలో చేరారు. వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు..జనసేనలో చేరేందుకు ఆయన రెడీ అయ్యారు. ఇటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం జనసేన వైపు వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి మంగళగిరిలో గెలిచారు. 2014లో టిడిపిలో చేరారు. మళ్ళీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.
ఇప్పుడు వైసీపీకి షాక్ ఇచ్చి జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సైతం జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. 1994లో ఒంగోలు నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. టిడిపిలో అనేక ఏళ్ళు పనిచేసిన ఈయన..2019 తర్వాత బిజేపిలో చేరారు. బిజేపిలో కూడా అంత యాక్టివ్ గా ఉండటం లేదు..దీంతో జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు.