హర్యానాలో విషాదం జరిగింది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలోని తరావడి ప్రాంతలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాల్ నగరంలోని తరావడి ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున రైస్ మిల్ భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా ధడేల్మన్న శబ్ధాలు విని స్థానికులు బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు.
‘‘ప్రమాద సమయంలో రైస్ మిల్లులో 150 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. భవనం ఒక్కసారిగా కుప్ప కూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మంది తీవ్రంగా గాయపడగా.. అందులో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించాం. భవనంలో కొన్ని లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఘటనపై విచారణకు కమిటీ వేసి.. రైస్ మిల్లు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని కర్నాల్ డీసీ అనీష్ యాదవ్ తెలిపారు.