కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు కరీంనగర్ పట్టణానికి చెందిన జ్యోతినగర్ వాసులుగా గుర్తించారు. వీరు ఖమ్మంలో జరిగిన దశదినఖర్మకు వెళ్లి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో మరణింనించినవారిని డ్రైవర్ హిందూరి జలంధర్, కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాస రావు, శ్రీరాజ్‌లుగా గుర్తించారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని పెంచాల సుధాకర్ రావుగా గుర్తించారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అతడికి చికిత్స అందిస్తున్నారు.