ప్రధాని మోడీ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మోడీ పర్యటనకు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మామునూర్ బెటాలియన్లో ప్రత్యేకంగా విశ్రాంతి గది ఏర్పాటు చేశారు. మోదీ మామునూర్ హెలిప్యాడ్ వద్ద దిగిన తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.
ఎండోమెంట్ కార్యాలయంలో విశ్రాంత గదిని ఏర్పాటు చేశారు. కేఎంసీ ఆవరణలోని సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సుబేదారి సమీపంలోని హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలోనూ విశ్రాంత గదితో పాటు వైద్యసేవల కోసం సకల సదుపాయాలు కల్పించారు. అత్యవసర పరిస్థితిల్లో వీటిని ఉపయోగించుకుంటారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం.. ఇవాళ్టీ నుంచి 8వ తేదీ వరకు వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో 20 కిలోమీటర్ల వ్యాసార్ధంలో గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తున్నట్లు సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఆదేశాల ప్రకారం.. డ్రోన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ వంటి వాటిని ఎగురవేయడం నిషేధం. ఈ ఆదేశాలను ధిక్కరించిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. అంతేకాదు.. వరంగల్, హనుమకొండ, ఖాజీపేట పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీ, సభలు, సమావేశాలు , మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేయడం నిషేధం.