కొవిడ్ మహమ్మారిపై తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు చేసిన హెచ్చరిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ఆయన సూచనలు చేసినా.. గత అనుభవాల నేపథ్యంలో ప్రజల గుండెల్లో సైరన్లు మోగుతున్నాయి. గత మూడ్ వేవ్ లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. మాస్కులను తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు, వాణిజ్యాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మునుపటి స్థితికి చేరుకుంటున్నాయి. హోటళ్లు వంటి బిజినెస్ లు పుంజుకుంటున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పాఠశాలలు తెరుచుకుని ఆర్థిక నష్టాల నుంచి గట్కెక్కుతున్నాయి. స్టూడెంట్లు కూడా స్కూళ్లకు వెళ్లేందుకు అలవాటు పడ్డారు. గతంలో మర్చిపోయిన టాపిక్స్ మళ్లీ మననం చేసుకుంటున్నారు.
ఇక మరేమి పర్వాలేదు.. ఇలాగే సజావుగా జరిగితే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతామనే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో హెల్త్ డైరెక్టర్ చేసిన కీలక సూచన మళ్లీ వారిలో ఒకరకమైన భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.మళ్లీ లాక్ డౌన్ తప్పదా? అదే జరిగితే మా పరిస్థితి ఏమిటి? అని ఆవేదన చెందుతున్నారు.
మరో మూడునాలుగు వారాల్లో కోవిడ్ కేసులు పెరగవచ్చునని, ప్రజలు మాస్కు తప్పనిసరిగా ధరించాలని శ్రీనివాసరావు చేసిన సూచనతో .. మళ్లీ నాలుగో వేవ్ తప్పదా అనే కీడు శంకిస్తోంది. నాలుగో వేవ్ ఉండదని ఆయన చెప్పినప్పటికీ.. నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.
దేశంలో పలు రాష్ట్రాలలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ, హర్యాణా, యూపీ. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉందని స్వయంగా శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.సగటున రోజుకు 9 లక్షల వరకు కేసులు నమోదు అవుతున్నాయి.చైనాలో అయితే పరిస్థితి తీవ్రంగా ఉంది. దేశ వాణిజ్య రాజధాని షాంఘైలో అత్యంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.కోవిడ్ 10 కొత్త ఎక్స్‌ఈ వేరియంట్ 8 దేశాల్లో ఉందని అధికారిక నివేదికలు పేర్కొంటున్నాయి.
దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ పెంచాలని సూచించింది. ప్రజలు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది.
నిజానికి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజేషన్ ను సరిగ్గా పాటించకపోవడం వల్లే కరోనా మరింత వేగంగా సోకే అవకాశాలు ఉన్నాయి. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ రకరకాలుగా మారుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ వచ్చే చాన్స్ ఉంది. నాకు ఒకసారి వచ్చిపోయింది కాబట్టి నాకేమి కాదు అనుకునేందుకు వీళ్లేదు. అదే సమయంలో ప్రతి ఒక్కరు వాక్సిన్లు వేయించుకోవాలి. అప్పుడే మహమ్మారి తీవ్రత తగ్గి స్వల్ప నష్టాలతో బయటపడగలం. ప్రభుత్వాలు కూడా ప్రజల భయాందోళనలు తీరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.