రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాయకులు ఎటు వైపు అడుగులు వేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. అయితే, అధికార పార్టీలోకి చేరేందుకు రెడీ.. లేదంటే.. మరో పార్టీ రెడ్ కార్పెట్ పట్టుకుని రెడీగా ఉంది. అయితే, కావాల్సిందల్లా.. అలా వచ్చే నాయకుడు జిల్లాలను శాసించగలగాలి! అంతే! ఇప్పుడు ఇదే ఫార్ములా మాజీ మంత్రి గంటా విషయంలోనూ వెలుగు చూస్తోంది.
2014లో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పడు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా తనకు అలవాటైన రీతిలోనే పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఇది..ప్రచారంగానే ఉంది. కానీ, ఇంతలోనే ఆయనకు అనుచరులుగా, ఆయనకు శిష్యులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా వైసీపీలోకి వస్తున్నారు. కానీ, గంటా మాత్రం రావడం లేదు. వాస్తవానికి గంటా చేరికకు గత నెల 16నే ముహూర్తం ఫిక్సయిందని ప్రచారంలోకి వచ్చింది. కానీ, జరగలేదు. గంటా మంత్రి పీఠాన్ని కోరుతున్నారని, దీనికి జగన్ అడ్డు చెబుతున్నారని కొందరు అంటున్నారు.
అయితే, గంటా రాకను అవంతి శ్రీనివాస్ ఏకంగా విజయసాయిరెడ్డి వంటి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ, వైసీపీలోనే మరో వర్గం గంటా రాకను స్వాగతిస్తోంది. గంటా వస్తే.. విశాఖలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా పట్టుసాధించడంతోపాటు.. టీడీపీ తుడిచి పెట్టేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఇప్పటి వరకు గంటా విషయంలో గంట గంటకు సీన్ మారుతూనే ఉంది.
ఇదిలావుంటే, ఒకవేళ గంటా కనుక వైసీపీలోకి వెళ్లపోతే.. తమ పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ కూడా రెడీగా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సోము వీర్రాజు కూడా సానుకూలంగానే ఉన్నారని చెబుతున్నారు. దీంతో గంటా వ్యూహం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి ఇప్పటికైతే.. ఎటూ తేలలేదనే చెప్పాలి.
-vuyyuru subhash