ఏపీ ప్రభుత్వం నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తామని ఆఖరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శనాస్త్రాలు సంధించారు. పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రకటించడంలోనూ ఆలస్యం, అయోమయం, ఎందుకింత గందరగోళం అంటూ ప్రశ్నించారు గంటా. నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తామని వాయిదా వేయడం అంటే చేతకానితనమేనని విమర్శించారు గంటా.
“అధికారులు ఎందుకింత అచేతనంగా మారుతున్నారు? మొన్నటివరకు రోజూ పేపర్ లీక్ వార్తలు, ఇప్పుడేమో ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయత. ఇంతకీ ఫలితాల వాయిదాకి కారణమేంటి? అసమర్థతా? ఇంకేమైనా లోపాయికారీ కారణాలా? విడుదల రోజే వాయిదాపడడంలో లోపం ఎక్కడ? గ్రేడ్ లు తీసేసి మార్కులు ప్రకటిస్తామని చెప్పారు… అంతవరకు ఓకే. కానీ ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన ఇలాంటి పరీక్ష ఫలితాల విడుదల సకాలంలో చేయకపోతే మీపై భరోసా ఎలా ఉంటుంది? కనీసం మిమ్మల్ని మీరు సమర్థించుకోగలరా? గతంలో పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల విడుదల తేదీని కూడా అకడెమిక్ క్యాలెండర్ లోనే పొందుపరిచేవాళ్లం… కచ్చితంగా అమలు చేసేవాళ్లం. ఇప్పుడెందుకలా చేయలేకపోతున్నారు?” అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు గంటా శ్రీనివాసరావు.