మహమ్మద్ ప్రవక్త పై మాజీ బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు దేశం లోపల, బయట చర్చకు కారణమయ్యాయి. పలు ఇస్లామిక్ దేశాలు భారత్ కు తమ నిరసన వ్యక్తం చేశాయి. అయితే భారత్ కూడా వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది. బిజెపి ఇప్పటికే నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇదిలా ఉంటే కొంతమంది మతఛాందసవాదులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చంపుతానని బెదిరిస్తున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. ఆమెకు మద్దతునిస్తూ ట్వీట్ చేశాడు.
” క్షమాపణలు చెప్పినా మహిళకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ద్వేషం,మరణ బెదిరింపులు చేయడంపై’ సెక్యులర్ లిబరల్స్ ‘ అని పిలవబడే వారి మౌనం కచ్చితంగా చెవిటిది! అంటూ ట్వీట్ చేశాడు. ఒక మహిళపై ఇంత ద్వేషం ప్రదర్శిస్తూ భయపడుతూ ఉంటే ఏ ఒక్క సెక్యులర్ లిబరల్స్ గా పిలుచుకునే మేధావులు స్పందించకపోవడంపై గౌతం గంభీర్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.