విశాఖ జిల్లా పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో అధికార పార్టీ దూకుడు.. ప్రతిపక్షానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ పార్టీ డెవలప్ అవుతుందని, పరుగులు పెడుతుందని భావించిన చంద్రబాబుకు.. పాడేరులో అధికార పార్టీ నాయకురాలు.. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి దూకుడు చెమటలు పట్టిస్తోంది. నిజానికి టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం మూడు సార్లు మాత్రమే టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. 1985లో కొట్టగుళ్లి చిట్టినాయుడు విజయం సాధించారు. దీంతో పార్టీకి ఇక్కడ పునాది పడింది. ఈయనే తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా.. 1994లో తిరిగి విజయం సాధించారు.
ఇక, 1999లో మళ్లీ టీడీపీ వరుస విజయం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో మత్స్యరాస మణికుమారి విజయం సాధించుకోవడంతోపాటు.. మంత్రిగా కూడా చంద్రబాబు కేబినెట్‌లో సీటు సంపాయించుకు న్నారు. ఇక, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీ ఇక్కడ జెండా ఎగరేసింది లేదు. వరుస పరాజయాలతో పార్టీ నానాటికీ తీసికట్టుగా మారిపోయింది. ఈ క్రమంలోనే 2014లో వైసీపీ తరఫున విజయం సాధించిన గిడ్డి ఈశ్వరికి మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేసిన చంద్రబాబు పార్టీలోకి చేర్చుకున్నారు.
అయితే, ఈ ఆఫర్లు లీక్ కావడంతో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఇక, వైసీపీకి కూడా దూరమయ్యారు. పైగా ఎస్టీల్లో అప్పటి వరకు గిడ్డి ఈశ్వరి తండ్రికి ఉన్న పేరు కూడా పోయింది. గతంలో ఆయన ఇక్కడ నుంచి నాయకుడిగా గెలుపొంది విజయం సాధించారు. 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేసిన గిడ్డి అప్పల నాయుడు విజయం సాధించారు. ఆయనకు మంచి పేరుంది. ఇదే 2014లో ఈశ్వరికి తోడైంది. అయితే, ఎప్పుడైతే.. పార్టీ మారి పదవి కోసం ప్రయత్నించిందో అటు ప్రజల్లోను, ఇటు వైసీపీకి కూడా దూరమైంది.
మరోపక్క, ఆమెను నమ్ముకున్న చంద్రబాబు, ఆయన పార్టీ కూడా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితికి చేరిపోయారు. ఇదిలావుంటే, గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన భాగ్యలక్ష్మి.. దూకుడు పెంచారు. తనను తాను బలోపేతం చేసుకుంటూ.. గిరిజనంలో నమ్మకం ప్రోదిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని కూడా బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ నుంచి దాదాపు రెండు వందల మంది కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇన్ని జరుగుతున్నా.. ఈశ్వరి మాత్రం బయటకు రాలేకపోవడం గమనార్హం.
పైగా కుటుంబ పరంగా కూడా అందరూ జగన్‌కు అబిమానులు కావడం, ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి.. జగనపై కామెంట్లు చేయడంతో.. కుటుంబానికి కూడా ఆమె దూరమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసినా.. రాజకీయంగా ఆమెకు, పార్టీ పరంగా టీడీపీకి కూడా తీవ్ర దెబ్బతగిలిందని అంటున్నారు పరిశీలకులు.
– vuyyuru subhash