చెరువులో బాలిక మృతదేహం.. రేప్‌ చేసి చంపారంటున్న కుటుంబ సభ్యులు..

ఓ ఇంటర్‌ విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లి.. శవమై తేలిన ఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగీర్తిపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న పెద్ద పోయి శ్రావ్య(17) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు శనివారం భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన శ్రావ్య.. రాత్రి కూడా తిరిగి ఇంటికి రాలేదు. దీనితో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలిక కోసం అన్ని చోట్ల వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, నిన్న మధ్యాహ్నం కోనాపూర్ చెరువులో బాలిక మృతదేహం లభ్యమవడంతో.. రామాయంపేట పోలీసులు, భిక్కనూర్ పోలీసులకు సమాచారం అందించారు.

Andhra Pradesh: Dead body found in a parked car at Patamatalanka in  Vijayawada

లభ్యమైంది కావ్య డెడ్ బాడీ అని నిర్ధారణ కావడంతో.. భాగిర్తిపల్లిలో ఉన్న బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహంపై పడి బోరున విలపించారు. శోకసంద్రంలో మునిగిన మృతురాలి తల్లిదండ్రులు.. తమ బిడ్డపై అత్యాచారం చేసి.. హత్య చేశారని ఆరోపించారు. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే తన కూతురు.. ఫోన్ కొనివ్వలేదని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని, ఇదెక్కడి అన్యాయమని బాలిక తండ్రి వాపోయాడు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేయవద్దని మృతురాలి కుటుంబ సభ్యులు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు.