పాలన పరంగా మరో మెట్టు ఎక్కారు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సర్వీసు రూల్స్ విషయమై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్న వేళ వాటికీ ఓ సుఖాంతం ఇచ్చారు. అంతేకాదు మండల స్థాయిలో నెలకొన్న సీనియార్టీ రగడనూ అత్యంత చాకచక్యంగా తుదికి తెచ్చారు. దీంతో కోర్టు పరిధిలో తేలని విషయాలు కూడా మంత్రి పెద్దిరెడ్డి చొరవతో, సీఎం ఆదేశాలు మేరకు ఓ కొలిక్కి రావడం శుభ పరిణామమే! వాస్తవానికి ఎంపీడీఓల పదోన్నతులకు సంబంధించి ఎప్పటి నుంచో వివాదం ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన ఎంపీడీఓ వర్గాల వారికి, మండల వ్యవస్థ ఏర్పాటయినప్పుడు ఇంఛార్జులుగా నియామకం పొందిన ఎంపీడీఓలకూ మధ్య వివాదం ఉంది. దీనిని పరిష్కరించేందుకు సీఎం గొప్ప చొరవ చూపారు. పదోన్నతుల విషయమై పెద్దిరెడ్డితో మాట్లాడి సంబంధిత సంఘాలతో మాట్లాడి వీరికి సర్వీసు పరంగా లబ్ధి చేకూర్చారు. పదోన్నతుల పరంగా న్యాయం చేశారు. దీంతో డిప్యూటీ సీఈఓలు, డీఎల్డీఓలు తెరపైకి వచ్చారు.
దీని ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒక డీఎల్ డీఓ (డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్) రానున్నారు. అదేవిధంగా జెడ్పీలకు సంబంధించి 12 మంది ఎంపీడీఓలను వారి అర్హతల మేరకు డిప్యూటీ సీఈఓలుగా నియమించారు. ఇప్పటి వరకూ జెడ్పీకి చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్లు మాత్రమే ఉండేవారు. తాజాగా మార్పుతో నియామకంతో డెప్యూటీ సీఈఓలూ వచ్చి విధుల్లోకి చేరనున్నారు.
ఇంకా చెప్పాలంటే…
ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్యను పరిష్కరించారు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ విధంగా ఆయన చరిత్ర సృష్టించారు. మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా వ్యవహరించే వారిని ఎప్పటి నుంచో పదోన్నతుల సమస్య వేధిస్తోంది. పాతికేళ్లుగా వీరిని వేధిస్తున్న సమస్యను పరిష్కరించి వారికో దారి చూపి, వారి నుంచి అభినందనలు అందుకున్నారు యువ ముఖ్యమంత్రి. ఈ క్రమంలో మొత్తం 660 ఎంపీడీఓ పోస్టులకు గాను మూడో వంతు పోస్టులకు పదోన్నతులు ఇచ్చారు.వీరిని డిప్యూటీ సీఈఓలుగా, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియమించి వారికో దారి చూపారు. దీంతో సంబంధిత వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు హయాంలో కూడా వీరు పదోన్నతుల విషయమయి పట్టుబట్టారు కానీ ఫలితం లేదని తేలిపోయింది.