ఐపీఎల్ పండగ మొదలై వారం పూర్తి కానుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున మరింత ఎక్కువ మంది వీక్షకుల్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందిని మాత్రమే అనుమతిస్తుంది.
కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో 50 శాతం ప్రేక్షకులను బీసీసీఐ అనుమతించనుందని తెలుస్తోంది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని సమాచారం.ఇక, ఏప్రిల్ 5 నుంచి 50% మంది ప్రేక్షకుల సామర్థ్యం కోసం ఏర్పాట్లు చేయాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్లు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. అన్నీ కుదిరితే ఏప్రిల్ 5న వాంఖడే స్టేడియంలో జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులు రానున్నారు. ఈసారి లీగ్‌లో కొత్తగా మరో రెండు జట్ల ఎంట్రీతో వినోదం రెండింతలు పెరిగింది. పది జట్లను గ్రూప్స్‌గా విడదీసి ఈ సారి కొత్త ఫార్మాట్లో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. రెండు గ్రూప్‌లను ఏర్పాటు చేసి, పది జట్లలో ఐదు జట్లకు గ్రూప్ ఏ, మిగతా వాటికి గ్రూప్ బీలో చేర్చారు.