గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళి సై నిరాకరించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం చర్చనీయాంశం అయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన వారి జాబితాను తమిళిసై తిరస్కరించారు. ఈ గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ దగ్గరికి తెలంగాణ ప్రభుత్వం జాబితా పంపించింది. కొంత కాలంగా దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లోనే ఉంచిన గవర్నర్ తాజాగా, నేడు తిరస్కరిస్తూ ప్రభుత్వానికి సమాచారం పంపించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
దీంతో.. గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణపై గవర్నర్ తమిళి సై స్పందించారు. రాజకీయాలకు చెందిన వారిని ప్రతిపాదిస్తే తిరస్కరిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారి పేర్లు పంపాలని సూచించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని గవర్నర్ చెప్పారు. గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ నామినేషన్ల సిఫార్సులను తాను ఎందుకు తిరస్కరించానో లేఖలో పూర్తిగా తెలిపానని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ అంశంపై తాను మాట్లాడనని స్పష్టం చేశారు.