కంచ గచ్చిబౌలి భూవివాదం పై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల HCU భూముల వివాదంలో అరెస్ట్ అయిన విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం పై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రుల కమిటీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం నిర్వహించిన భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
క్యాంపస్ లో ఉన్న పోలీస్ బలగాలను ఉపసంహరించాలని.. నిషేదాజ్ఞలు తొలగించాలని.. అరెస్ట్ అయిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్లు మంత్రుల కమిటీ ముందు ఉంచగా.. విద్యార్థుల కేసులపై సానుభూతితో సమీక్సిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివాదస్పద భూమిలో బందోబస్తు కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే 400 ఎకరాల్లో నష్టం అంచనాకు, జీవవైవిద్య సర్వేకు అనుమతి కోరగా.. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సర్వేకు అనుమతి ఇవ్వలేమని తెలియజేశారు.