పీవీ కూతురు చుట్టూ ఎమ్మెల్సీ రాజకీయం

-

పీవీ కూతురు చుట్టూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజకీయం నడుస్తోంది.పివి కూతురును బరిలోకి దింపడంపై టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి కాంగ్రెస్, బిజెపి పార్టీలు. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పై అధికార,విపక్షల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది.

మహబూబ్ నగర్ – హైదరాబాద్ – రంగారెడ్డి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి చుట్టూ రాజకీయము నడుస్తోంది. వాణి దేవిని అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కాంగ్రెస్, బిజెపి పార్టీలు అధికార టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. పీవీ కూతురు వాణిని పోటీలో పెట్టి..కాంగ్రెస్ ఓట్లు చీల్చాలని టిఆర్ఎస్ కుట్ర అని ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి.బిజెపికి లబ్ది చేకూర్చడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు రేవంత్.

ఇటు టిఆర్ఎస్ ఓడి పోతుందనే టికెట్ ఇచ్చారని పీవీ మనువడు సుభాష్ అన్నారు. సామాజిక వర్గం ఓట్లు చీల్చేందుకే వాణి దేవికి టికెట్ ఇచ్చారని అన్నారు సుభాష్. పీవీ కుటుంబం పై ప్రేమ ఉంటే…చాలా కార్పొరేషన్ పదవులు ఉన్నాయని గుర్తు చేశారు సుభాష్. అంత ప్రేమ ఉంటే పీవీ నరసింహరావు కుటుంబానికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బిజెపి అభ్యర్థి రామచంద్ర రావు అన్నారు .

సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నది కమలనాథుల వ్యూహం. దానిని బ్రేక్‌ చేయాలని గులాబీ నేతలు చూస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో సత్తా చాటి పార్టీకి కొత్త ఊపిరులు ఊదాలని చూస్తోంది కాంగ్రెస్‌. మాజీ మంత్రి చిన్నారెడ్డిని బరిలో దించింది. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సైతం పోటీలో ఉన్నారు. ఈ హేమాహేమీ నాయకుల మధ్య టీఆర్‌ఎస్‌ గెలుపు వ్యూహం పక్కాగా ఉందన్నది టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పేమాట. పీవీ నరసింహా రావు దేశానికి చాలా సేవ చేసారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.ఆ సేవలను దృష్టిలో ఉంచుకొని వాణి దేవికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని అన్నారు.

మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి రాజకీయ విమర్శలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో చూడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version