ముగిసిన గ్రేటర్ ప్రచారం..ఇక పోల్ మేనేజ్ మెంట్ దే కీ రోల్

-

హోరెత్తించిన గ్రేటర్‌ ప్రచారం ముగిసింది. మైకులకు తాళాలు పడ్డాయ్‌. ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌ మీద పడ్డారు అభ్యర్ధులు. ఇటు మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిఘా పెంచారు. అధికారికంగా ప్రచారం ముగిసింది.. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు హైదరాబాదీలు. ఇప్పటికే మేయర్‌ పీఠం ఎవరికి దక్కబోతుందన్న టెన్షన్‌ కొనసాగుతోంది. . ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే ఓటు కోసం ఆకర్ష మంత్రం వేస్తున్నారు. డబ్బు, చీరల కొన్ని చోట్ల పంచుతున్నారు. కాలనీల్లో ఉండే సంక్షేమ సంఘాల డిమాండ్లను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.

పోలింగ్‌ బూత్‌ల వారీగా తమ మనుషులను రంగంలోకి దింపి వారికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం పోలింగ్‌ జరగనుండడంతో ఈ మధ్యలో ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా పెంచారు. ఇటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్‌తో పాటు అక్బరుద్దీన్‌, ఎంపి అరవింద్‌కుమార్‌లపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలకంగా మారింది. ఇందుకోసం అభ్యర్ధులు ప్రత్యేకంగా వాలంటీర్లను పెట్టుకుంటున్నారు. అయితే పోస్టింగ్స్‌లో కొన్ని అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు నిఘా పెట్టారు. రెచ్చగొట్టే పోస్టింగులు పెట్టినవారిపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఇటు ప్రచారం తర్వాత నేతలెవ్వరూ ఇక్కడ మకాం వేయకూడదంటున్నా పోలీసులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పోలింగ్‌ రోజున మూడు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించనున్నారు. కేవలం అభ్యర్థికి సంబంధించిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అంటున్నారు. అటు కౌంటింగ్‌ రోజైన డిసెంబర్‌ 4న కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. డిసెంబర్ 1 ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news