చుట్టూ పచ్చటి కొండలు, చేతిలో వేడి వేడి టీ, ఎదురుగా మీకు నచ్చినవాళ్ళు, మీతో పాటు నేను కూడా ఉన్నానంటూ మిమ్మల్ని తాకి వెళ్ళే గాలి, అది చూసి మీలో కలిగిన చిరు దరహాసం.. ఇది చాలదా జీవితంలోని రసరమ్యతను ఆస్వాదించడానికి. పర్యాటకంలో ప్రశాంతత దాగుందన్న విషయం పర్యటించేవారికే తెలుస్తుంది. మీరు పర్యాటకాన్ని ఇష్టపడే వారైతే భారతదేశంలోని ఈ కొండప్రాంతాలని అస్సలు మిస్ కావద్దు.
ఆలి- ఉత్తరాఖండ్
భారతదేశంలోని అత్యంత పచ్చగా ఉండే ఈ కొండప్రాంతం పచ్చిక భూములతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో మంచుతో తెల్లగా పాలనురుగులా దర్శనమిచ్చే ఈ ప్రాంతం చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న అద్భుత ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడానికి కేబుల్ రైడ్ తీసుకోండి. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి చాలా నచ్చే ప్రదేశం ఇది.
ఇడుక్కి- కేరళ
తోడుపుజయార్, పెరియార్, తలయార్ వంటి నదులు కలిగిన ఈ ప్రాంతం హరితవర్ణంతో శోభిల్లుతూ ఉంటుంది. వన్యప్రాణుల అభయారణ్యాలు, సుగంధ ద్రవ్యాలు అమితంగా ఆకర్షిస్తాయి. ఇడుక్కి ప్రాంతంలో భారతదేశంలోని పెద్ద ఆనట్టల్లో ఒకటైన ఇడుక్కి ఆర్చ్ ఆనకట్ట ఉంది.
సోన్ మార్గ్- జమ్మూ కాశ్మీర్
గ్రేటర్ హిమాలయాల చుట్టూ ఉండే ఈ కొండ ప్రాంతం చూపరులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ప్రకృతి దృశ్యాలతో పాటు గుర్రపు స్వారీ వంటి సాహస కార్యకలాపాలు చేయవచ్చు. చుట్టూ ఉండే ఫైన్ చెట్లు కళ్ళను కట్టిపడేస్తాయి.
చిక్ మంగళూరు- కర్ణాటక
కాఫీని ఇష్టపడే పర్యాటకులు చిక్ మంగళూరు వెళ్ళకపోతే మీ పర్యాటకం సంపూర్ణం కానట్టే లెక్క. కాఫీ తోటలు అమితంగా ఉండే ఈ కొండప్రాంతం అందంగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదట కాఫీ సాగు చేసిన ప్రదేశం ఇది. ఇక్కడ తిరుగుతున్నప్పుడు కాఫీ వాసనను పసిగట్టవచ్చు.