విజయవాడ- హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని.. దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్కు రెండు గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ఇప్పుడున్న రహదారిని ఆరు లేన్లకు విస్తరించే పనులు మొదలయ్యాయి.
దీంతో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం ఐదు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుంది’ అని పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలో ఆయన జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం. నాయకత్వం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందడుగేస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇది’ అని ప్రశంసించారు.