తిరుపతి ఉప‌ఎన్నికలో వైసీపీని టెన్షన్ పెడుతున్న గూడూరు‌ వర్గపోరు

Join Our Community
follow manalokam on social media

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి ,టిడిపి తరపున పనబాక లక్ష్మి, బిజెపి- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బరిలో ఉన్నారు. ప్రచారానికి మరో వారంరోజులే ఉండటంతో.. అన్ని పార్టీలు క్యాంపెయినింగ్‌లో హోరెత్తిస్తున్నాయి. కానీ వైసీపీ నాయకులను ఓ‌ నియోజకవర్గం తెగ టెన్షన్ పెడుతుందట. పార్టీలో ఉన్న గ్రూప్ వార్ కారణంగా ఈ సారి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందా, రాదా అన్న అంశం తిరుపతి రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి నాయకులను కలవర పెడుతుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి లక్షా పది వేల 31 ఓట్లు వచ్చాయి. 46,381 మెజార్టీ వచ్చింది.గూడూరు‌ నియోజకవర్గం దివంగత వైసీపి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ సొంత నియోజకవర్గం. దుర్గా ప్రసాద్ ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ఉప ఎన్నికలో కూడా రికార్డు మెజార్టీ రావాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి వైసీపీ నేతలను ఆదేశించారు. అలా వస్తేనే జగన్ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అవ్వగలరు.

ఉపఎన్నికలో అస్త్ర శస్త్రాలతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపఎన్నికలో కూడా వైసీపీకి గూడూరు నియోజకవర్గంలో ఆ స్థాయిలో ఓట్లు వస్తాయా.. అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పైగా వర్గవిభేదాలు ఎక్కువ అయ్యాయనే టాక్‌ వినిపిస్తోంది. గత కొంతకాలంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కి, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రా రెడ్డికి పడటం లేదు. మరికొందరు అధికార పార్టీ నాయకులతో కూడా ఎమ్మెల్యేకి పొసగటం లేదట. కొద్దిరోజుల క్రితమే వర ప్రసాద్ అవినీతికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి.

 

ఇక పార్టీ పెద్దలతో మంచి సంబంధాలున్న పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఒక వర్గం గాను..మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సన్నిహితుడైన కొడవలూరు ధనుంజయరెడ్డి మరో వర్గం గానూ.. నేదురుమల్లి కుటుంబం సపరేట్ వర్గంగా ఉంటున్నాయి. ఇక గూడూరు మాజీ చైర్ పర్సన్ కొనక దేవసేనమ్మ దంపతులు కూడా న్యూట్రల్ గా ఉంటున్నారు. గూడూరు అసెంబ్లీ నియోజక వర్గం ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ.. ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యేగా వర ప్రసాద్ గెలిచాక కొంతకాలం పాటు అందరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తనయుడు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేతో విభేదించి దూరమైపోయారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో.. ఎవరికి వారుగా వస్తూ వర్గాలుగా కొనసాగుతున్నారు.

వైసీపీ నేతల మధ్య విభేదాలే ఉపఎన్నికలో కొంపముంచుతాయేమోనన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక మంత్రిని , స్థానిక ఎమ్మెల్యేతోపాటు మరో ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించారు సీఎం జగన్. ఈ క్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రి అనిల్ సమావేశం నిర్వహించి నాలుగు రోజులు కాకముందే కనుమూరి హరిశ్చంద్రారెడ్డి ఏకంగా పార్టీకే రాజీనామా చేశాడంటే ఇక్కడ వర్గ పోరు ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది. అయితే వర్గ విభేదాలు వేరు, ఉపఎన్నిక వేరు అని వైసీపీ‌ నేతలు చెబుతున్నా గూడూరులో వైసీపీకి గత ఎన్నికల్లో మాదిరే మోజార్టీ అన్న టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతుంది.

 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...