మనకు అనారోగ్యం వస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు మనల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. అంటే మామూలు సమయాల్లో ప్రేమ ఉండదని కాదు. కానీ అనారోగ్యం బారిన పడితే మన వాళ్లు మన పట్ల ఎక్కువ శ్రద్ధను కనబరుస్తారు. వారి స్పర్శనే మనల్ని వేగంగా కోలుకునేలా చేస్తుంది. అయితే కోవిడ్ బారిన పడి చికిత్స పొందే వారికి ఇలాంటి ఆత్మీయ స్పర్శ లభించదు. వారు రోజుల తరబడి ఒంటరిగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంటూ, పలకరించే వారు లేక దిగులుగా చికిత్స తీసుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వారికి మేమున్నామని ఆ నర్సులు ఉదారతను చాటుతున్నారు. నేరుగా స్పృశించకపోయినా వారు ఆ విధమైనటువంటి ఫీలింగ్‌ను కోవిడ్ రోగులకు అందిస్తున్నారు.
బ్రెజిల్‌లో నర్సులు కోవిడ్ రోగులకు ఆత్మీయ స్పర్శను అందిస్తున్నారు. అందుకు గాను వారు పేషెంట్లను నేరుగా తాకడం లేదు. కానీ రబ్బరు గ్లోవ్‌లలో వేడి నీళ్లు నింపి వాటిని పేషెంట్ల చేతులకు తగిలిస్తున్నారు. దీని వల్ల కోవిడ్ బాధితులు తమను ఆత్మీయంగా స్పృశించినట్లు ఫీలవుతున్నారు. ఇది తమకు ఎంతో స్వాంతన అందిస్తుందని ఆ బాధితులు అంటున్నారు. కోవిడ్ బారిన పడ్డ వారిని ఎవరూ టచ్ చేయరు. కానీ నర్సులు ఈ విధంగా చేస్తున్నందున వారు కోల్పోయిన ఆత్మీయ స్పర్శను మళ్లీ తిరిగి పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అక్కడ నర్సులు ఇలా చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వారు చేస్తున్న ఆ ప్రయత్నాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. కోవిడ్ బారిన పడి ఒంటరిగా ఉండే వారికి ఇది ఎంతగానో మానసిక ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తుందని అంటున్నారు.