ఆంధ్రావనిలో వలంటీర్ వ్యవస్థకు మూడేళ్ల నిండిపోనున్నాయి త్వరలో.. వారి జీతాలను మాత్రం పెంచలేదు. పని ఒత్తిడి మాత్రం అదేవిధంగా ఉంది. ఐదు వేల రూపాయల జీతంతోనే వీళ్లంతా కాలం నెట్టుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు మరియు గత ఏడాది కూడా వలంటీర్లకు వందనం అంటూ జగన్ మోహన్ రెడ్డి వారిని సత్కరించే పని పెట్టుకున్నారు. గత ఏడాదిలో ఇందుకు 226.77కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ ఏడాది 239.22 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తం 465.99 కోట్ల రూపాయలు కేవలం వలంటీర్ వ్యవస్థ కోసమే వెచ్చించారు. వారికి నగదు ఇచ్చి సత్కరించి మరింతగా పనిచేయాలని చెప్పడం ఈ కార్యక్రమ ఉద్దేశం.
ఇవాళ్టి నుంచి అంటే ఏప్రిల్ ఏడు నుంచి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలూ, ఎంపీలూ భాగం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,33,333 మందికి నగదు పురస్కారాలు అందించి ప్రోత్సహించనున్నారు. నగదు పురస్కారంతో పాటు సర్టిఫికెట్, శాలువా కూడా అదనం.
వాస్తవానికి పూర్తిగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవస్థ కారణంగా ప్రభుత్వానికి జరిగిన మేలు ఏంటన్నది స్పష్టం కావడం లేదు. కొందరు మాత్రమే అందుబాటులో ఉండి పని ఒత్తిడిని మోస్తున్నారు.ఇంకొందరు పని చేయడం ఇష్టం లేక
మొరాయిస్తున్నారు. వీరిని కూడా ఎమ్మెల్యేలు ఏమీ అనడం లేదు. ముఖ్యంగా ప్రతి యాభై నుంచి వంద ఇళ్లకు పనిచేసే వలంటీర్లు కొందరు అస్సలు క్షేత్ర స్థాయిలో కనిపించని దాఖలాలు కూడా ఉన్నాయి. వీరిపై అధికారుల నియంత్రణ కానీ లేదా పర్యవేక్షణ కానీ పెద్దగా లేదు. కొన్ని చోట్ల బాగా పనిచేసేవారిని ఉపయోగించుకుంటున్నా అంతా అదే విధంగా అంకిత భావంతో ఉన్నారని అనలేం.
త్వరలో ఎన్నికలు వస్తున్నందున పార్టీ పనులు కూడా వీరికి అప్పగిస్తారని టాక్ ఒకటి నడుస్తోంది. అంటే సర్వేలు చేయిస్తారని కూడా అంటున్నారు. ఆ పని ఉన్నా లేకపోయినా వేళకు వీరికి అప్పగించిన పనులు సజావుగా చేసి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. కానీ చాలా మంది వలంటీర్లు నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారు. పౌరులతో ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కాస్త చదువుకున్న వారు కూడా తిరుగుబాటు ధోరణిలోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో పర్యటించక పోవడంతో వీరంతా తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే చాలీచాలని జీతం (ఐదు వేలు) తో తాము ఎలా పనిచేస్తామని, ఎనిమిది వేలు చేస్తామని చెప్పి ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్లు
దాటిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు అని అందుకే తాము పెద్దగా తమకు అప్పగించిన పనులపై దృష్టి సారించడం లేదు అని, వీలుంటే ఈ ఉద్యోగం వదిలి పోవాలని కూడా అనుకుంటున్నామని ఇంకొందరు వలంటీర్లు న్యాయబద్ధమైన డిమాండ్ ను
మీడియా ఎదుట వినిపిస్తున్నారు.