ఏపీలోని ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్ కు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కొరియర్, కార్గో బుకింగ్ చేయాలంటే.. ఆర్టీసీ బస్ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏజెంట్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవకాశం లేదు.
నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సులోనే కొరియర్, కార్గో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఎవరైనా కొరియర్, కార్గో బుక్ చేసుకోవాలంటే.. సంబంధిత బస్సు దగ్గరకు వెళ్లి నేరుగా కండక్టర్ వద్దే పార్సిల్ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న తర్వాత సత్వరమే పార్సిల్లు.. గమ్య స్థానాలకు చేరతాయి. దీని కోసం టీమ్ మెషిన్ల ద్వారా కొరియర్ బుకింగ్ చేయడం.. రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు శిక్షణ ఇస్తున్నారు. కొరియర్ బుకింగ్ మొత్తాన్ని టికెట్ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా విడిగా నమోదు చేస్తారు. దీంతో ప్రయాణికులకు చాలా వరకు మేలు జరుగనుంది.