తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు కర్రలను పంపిణీ చేశారు. నడక మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులకు కర్రల్ని పంపిణీ చేయాలని టీటీడీ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల కోసం పదివేల కర్రలను అందుబాటులోకి తెచ్చారు. మరో పదివేల కర్రలను కూడా సిద్ధం చేయనున్నారు. మొత్తం 20వేల కర్రలను సిద్ధం చేస్తున్నారు. వీటికి కేవలం రూ.45వేలు మాత్రమే ఖర్చు అయినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కర్రల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కొండపైకి వెళ్లే భక్తులకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కర్రలను అందజేశారు. నడకదారిలో వెళ్లే భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసమే కర్రలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. చేతి కర్ర ఇచ్చి ..టీటీడీ చేతులు దులుపుకోదని భూమన వెల్లడించారు. భక్తుల రక్షణ కోసం అడుగడుగునా సిబ్బంది పహారా ఉంటుందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద భక్తులు కర్రలు తిరిగి ఇవ్వాలని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.