టీమ్ ఇండియా ప్లేయర్లలో కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారముందని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్య జట్టు కెప్టెన్సీ చేపట్టే ఆస్కారం ఉందన్నాడు. ‘‘ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలిసారే జట్టు (గుజరాత్ టైటాన్స్)ను గెలిపించడంతో హార్దిక్‌ను భారత తదుపరి సారథిగా గుర్తించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో అతను కచ్చితంగా టీమ్‌ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. ఇప్పుడు కొంతమంది ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవచ్చు.. చెప్పలేం. ఆటగాళ్లు దీని గురించి ఎంతో ఆలోచిస్తారు’’ అని అతను పేర్కొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, అశ్విన్, దినేశ్ కార్తీక్ లాంటి 30ల్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు ఈ కప్పులో నిరాశపర్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు టీమ్‌ఇండియా టీ20 జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేయనున్నట్లు తెలిసింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత ఘోర పరాజయం పాలవ్వడం వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రమంగా టీ20 జట్టుకు దూరమవుతారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.