మధుమేహం వస్తే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది తాగొద్దు.. ఏది పడితే అది తినొద్దు. షుగర్ లెవల్స్ మరీ పెరిగితే.. అది ప్రాణాంతకం అవుతుంది. రక్తంలో నిరంతరం పెరిగిపోతుండే చక్కెర స్థాయిలు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలపై చెడు ప్రభావం చూపిస్తాయి. అందుకే మధుమేహం మరింత విపరీతమయ్యే పరిస్థితికి తెచ్చుకోవద్దు అంటారు వైద్యులు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఆహారంలో కొన్ని పండ్లు తీసుకోవడంతో మధుమేహాన్ని కొద్దిగా అదుపులో పెట్టొచ్చు. అవేంటంటే..
రోజుకో యాపిల్ తింటే వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా యాపిల్స్ చాలా మేలు చేస్తాయి. ఆపిల్ చక్కెర స్థాయిలను పెంచేస్తుందనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఆపిల్‌లో విటమిన్-సి, ఫైబర్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పైగా రుచి కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి.. తీపి తినేందుకు భాగ్యం లేదని బాధపడేవారు ఆపిల్ ద్వారా ఆ కోరిక తీర్చుకోవచ్చు.
ఆపిల్‌లో నీటి శాతం కూడా ఎక్కువే ఉంటుంది.. ఆపిల్ తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. పైగా ఈ పండులో క్యాలరీల శాతం కూడా తక్కువే. అయితే, ఆపిల్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.. దాని వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందేమో అనే సందేహం కలగొచ్చు.. అది కూడా నిజమే. కానీ, ఆపిల్‌లో ఉండే ఫైబర్ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నాయి.
యాపిల్‌తో పాటు మధుమేహం ఉన్నవారికి మేలు చేసే రెండో అద్భుతమైన పండు.. జామ… జామ చెట్టు నుంచి పండు వరకూ అన్నీ వీరికి చాలా బాగా ఉపయోగపడతాయి. జామ ఆకులతో టీ చేసుకుని తాగొచ్చు.. పండు వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల తరిగిన జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి, అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మితంగా తినడం ఉత్తమ ఎంపిక. అయితే డయాబెటిస్ ఉన్నవారు మామిడి, ద్రాక్ష, సీతాఫలం, సపోటా లాంటి పండ్లను దూరంగా పెట్టడం మంచిది.