భట్టి నాకు చాలా గౌరవం.. కానీ : హరీశ్‌రావు

-

నేడు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో భట్టి విక్రమార్కకు మంత్రి హరీశ్‌ రావుకు మధ్య మాటల యుద్ధం నెలకొంది. అయితే.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘భట్టి గారంటే నాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవజ్ఞులు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయనకు సమాచారం అందిస్తున్నవారు తప్పుడు సమాచారం అందిస్తున్నారు… ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కారణంతో ఇప్పుడు మధ్యలో మాట్లాడాల్సి వస్తోంది తప్ప… భట్టిపై గౌరవం లేక కాదు. డీపీఆర్ లు లేనేలేవని, డీపీఆర్ లు సమర్పించనేలేదని వీళ్లు బయటికి వెళ్లి అసత్య ప్రచారం చేస్తున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను 13-09-2022 నాడు కేంద్ర జలమండలికి సమర్పించాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రభుత్వం అడ్డుకోవడంలేదని, దాంతో ఫేజ్-2 ఎన్ఎస్ పీ కి నీళ్లు రానేరావని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసింది. 12-05-2020 నాడు కేఆర్ఎంబీలో దీనిపై ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించాం. అదే ఏడాది జూన్ లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించి అపెక్స్ కౌన్సిల్ వద్దకే ఈ సమస్యను తీసుకెళ్లాలని పోరాటం చేశాం.

తెలంగాణ ప్రభుత్వం చేసిన తీవ్ర పోరాటంతో రాయలసీమ ప్రాజెక్టును ఆపివేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తో ఆదేశాలు ఇప్పించగలిగాం. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయి. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాం. కానీ మేం ఏమీ చేయనట్టుగా మీరు తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేస్తున్నారు… కాబట్టే ఈ వివరణ ఇస్తున్నాం” అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ పాలమూరు ప్రాజెక్టు చూడాలనకుంటే రేపే వెళదాం పదండి అని భట్టికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news