కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. “ఇదీ… దక్షిణ భారతదేశం అంటే! బీజేపీ పాలన నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇంతే. బీజేపీ పతనం దక్షిణాది నుంచే మొదలైంది. ఇక ప్రతి చోటా వాళ్ల ఖాతాలు మూసుకోవాల్సిందే. తెలంగాణలో అయితే వాళ్లకు డిపాజిట్లు కూడా రావు” అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. హరీశ్ రావు తనయుడు తన్నీరు ఆర్చిష్మాన్ అమెరికాలోని బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. గురువారం జరిగిన స్నాతకోత్సవానికి మంత్రి హాజరయ్యారు.
తన కొడుకు సాధించిన విజయానికి ఇంతకంటే గర్వపడలేనని హరీష్ రావు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది అతని పట్టుదల, మార్పు కోసం అభిరుచికి నిదర్శనం. ఆర్చిష్మాన్ గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారని ఆయన చెప్పారు. హరీశ్‌రావు తన ట్వీట్‌లో ‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలనా? ఇది అతనిలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు’ అంటూ తన తనయుడిని ఉద్దేశించి క్యాప్షన్ రాసుకొచ్చారు మంత్రి హరీశ్ రావు.