తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాలు పలు చోట్ల పూర్తి కావచ్చాయి. దీంతో వాటిని వెంటనే ప్రారంభించి లబ్దిదారులకు అందజేస్తున్నారు. ఆర్ధిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ పట్టణం రహమత్ నగర్ లో రూ. 19.25 కోట్లతో నిర్మించిన 312 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు.మంత్రి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించి,స్వీట్స్ తినిపించారు.
దీనికి కేసీఆర్ ఎన్ క్లేవ్ అని పేరు పెట్టగా ఈ సందర్భంగా హరీష్ రావు ఆకస్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇళ్లను చూస్తుంటే తనకు ఇక్కడ ఎందుకు ఇల్లు లేదు అని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.ఒకేరోజు రంజాన్, క్రిస్ మస్, దసరా పండుగలు వస్తే ఎలా ఉంటుందో లబ్దిదారులకు ఈ రోజు అలా ఉందని సంబురపడ్డారు. ఇక్కడి లబ్దిదారులు ఎక్కడికీ వెళ్లకుండా రెండు మూడు నెలల్లో ఒక రేషన్ షాపు, అంగన్ వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.హోతి (కె)లో నిర్మిస్తున్న 700 ఇండ్లను త్వరలో పూర్తి చేసి రెండు మూడు నెల్లలో అర్హులైన పేదలకు ఇస్తామని తెలిపారు. ఇక స్వంత స్థలం ఉన్న వెయ్యిమందికి ఇండ్ల నిర్మాణం కోసం ఆర్ధిక సాయం చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్వంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునే వారికి కూడా సర్కార్ సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మెప్మా ఆధ్వర్యంలో 150 స్వయం సహాయక సంఘాలకు రూ. 15.82 కోట్ల చెక్కును లబ్దిదారులకు మంత్రి అందజేస్తూ.ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.