మాజీ సీఎం కేసీఆర్‌కు హరీష్ రావు కుడిభుజం లాంటోడని ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…హరీష్ రావు ప్రతిసారి భారీ మెజారిటీతో గెలుపొందే నేత అని, హరీష్ రావు మీద ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుందని అన్నారు. ఆయన రాజీనామా సవాల్‌ను ప్రజలు నమ్ముతున్నారని ,నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామా పత్రాన్ని ప్రజల ఎదుట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజీనామా చేస్తా అని , అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. కాని ఒక్కసారి కూడా మాట మీద నిలబడలేదని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్ రెడ్డి వెళ్లేప్పుడు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని ఆయన గుర్తుచేశారు. హరీష్ రావు రాజీనామాపై మాట్లాడే ముందు రేవంత్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని, హరీష్ రావు అనుభవజ్ఞుడైన నాయకుడు.. ఆయన నుంచి రేవంత్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు.హరీష్ రావు సవాల్‌ను రేవంత్ స్వీకరించలేకపోతున్నారని సెటైర్ వేశారు.